కమనీయం... ప్రసన్నుడి కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

కమనీయం... ప్రసన్నుడి కళ్యాణం

రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. కొండ బిట్రగుంటలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

బిట్రగుంట ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం - రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

బిట్రగుంట, మార్చి 14 : జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో వేద పండితులు కన్నుల పండువగా నిర్వహించగా, వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. గోవింద నామస్మరణలతో కొండ బిట్రగుంట మారుమోగింది.   

తొలుత శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్లకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రములు సమర్పించారు.  అంతరం అశేష భక్తజనంతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవ వేడుకలోని అద్భుతమైన ప్రతి ఘట్టాన్ని కూడా వేద పండితులు భక్తులకు సాక్షాత్కరింపచేయగా, మంత్రి భక్తిశ్రద్ధలతో  వీక్షించారు. 

కళ్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవారిని  మంత్రి,ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ దేవాదాయ శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని  తెలిపారు. కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దేవాదాయ శాఖ మంత్రిగా మూడోసారి దర్శించుకోవడం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా  చెప్పారు. కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి దేవాదాయ శాఖ తరపున బిట్రగుంట ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా అన్నివిధాల సహకారం అందిస్తామని చెప్పారు. 12.50 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని, అన్ని పనులు కూడా టెండర్లు పూర్తయి మొదలవుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, ఈవో కార్యాలయం, విశ్రాంతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. తిరుమల తరువాత దక్షిణాదిన బిట్రగుంట క్షేత్రము అత్యంత ప్రసిద్ధి చెందినదని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. 

శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర మాట్లాడుతూ 27 సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయలతో శిధిలావస్థలో ఉన్న ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వాల సహకారంతో బిట్రగుంట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కావలి ఎమ్మెల్యేగా  కృష్ణారెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఆలయ అభివృద్ధికి నిరంతరం ఆలోచన చేస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారి సారధ్యంలో ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం కావడం భగవదనుగ్రహంగా భావిస్తున్నట్లు బీద రవిచంద్ర చెప్పారు. 2028 బ్రహ్మోత్సవాల నాటికి ఆలయంలో శాశ్వతంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన గురుతుల్యులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం, మొదటిసారిగా ఒక దేవాదాయ శాఖ మంత్రి బిట్రగుంట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రూ. 1.85 కోట్లతో ఆలయానికి కాంపౌండ్ వాల్, 2.65 కోట్ల టిటిడి నిధులతో గాలిగోపురం నిర్మాణ పనులు త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, అన్నదాన సత్రం నిర్మాణాలు మొదలైన ఆలయ అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొస్తున్నారని, వారందరి సహాయ సహకారాలతో, దేవాదాయ శాఖ నిధులతో బిట్రగుంట ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయనున్నట్లు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఈవో అరవ రాధాకృష్ణ, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

..................... 

DIPRO, NELLORE

google+

linkedin